Election commission: అది లీక్ కాదు.. ఊహ మాత్రమే.. కర్ణాటక ఎన్నికల షెడ్యూలుపై ఈసీ దర్యాప్తు కమిటీ
- ఈసీ కంటే ముందే షెడ్యూలు విడుదల చేసిన బీజేపీ ఐటీ సెల్
- దుమ్మెత్తి పోసిన ప్రతిపక్షాలు
- అదంతా ఊహాగానమేనని తేల్చేసిన ఈసీ
కర్ణాటక ఎన్నికల పోలింగ్ తేదీలు లీక్ కాలేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. బీజేపీ మీడియా సెల్ విడుదల చేసిన షెడ్యూలు కేవలం ఊహాగానం మాత్రమేనని పేర్కొంది. కర్ణాటకలో ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నది ఎన్నికల కమిషన్ మార్చి 27న షెడ్యూలు విడుదల చేయడానికి ముందే బీజేపీ ఐటీ సెల్ ఆ వివరాలను విడుదల చేసింది. ఆ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ ఎన్నికల సంఘం ప్రకటనకు ముందే పోలింగ్ తేదీలను ట్వీట్ చేశారు.
దీంతో పెను దుమారమే రేగింది. బీజేపీ కనుసన్నల్లోనే ఎలక్షన్ కమిషన్ నడుస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. లేదంటే ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించడానికి ముందే ఆ వివరాలు ఎలా తెలుస్తాయని ఆరోపించాయి.
ఈ వ్యవహారం కాస్తా వివాదంగా మారడంతో రంగంలోకి దిగిన ఈసీ పోల్ తేదీల లీక్పై దర్యాప్తు కోసం హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కమిటీ దర్యాప్తు వివరాలను వెల్లడించింది. అమిత్ మాలవీయ కేవలం మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని ట్వీట్ చేశారని, పోలింగ్ తేదీలు లీక్ కాలేదని స్పష్టం చేసింది. అమిత్ మాలవీయ చేసిన ట్వీట్లో పోలింగ్ తేదీ సరిపోలినా కౌంటింగ్ తేదీ తేడా ఉందని పేర్కొంది.