Rajasthan: కన్న బిడ్డ హత్య కోసం సుపారీ ఇచ్చిన తల్లి... నమ్మశక్యం కాని నిజాన్ని వెలికితీసిన పోలీసులు!
- రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో ఘటన
- భూమి అమ్మేందుకు అంగీకరించని కుమారుడు
- నలుగురితో కలసి ప్లాన్ చేసి చంపించిన తల్లి
డబ్బు కోసం మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతాయో చెప్పకనే చెబుతున్న మరో ఘటన ఇది. ఉదయ్ పూర్ లో జరిగిన ఓ హత్య కేసును విచారించిన పోలీసులు, నమ్మశక్యం కాని నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఓ తల్లి తన కుమారుడిని చంపడానికి రూ. లక్ష సుపారీ చెల్లించి కాంట్రాక్టు కుదుర్చుకుని, బిడ్డను హత్య చేయించింది.
మరిన్ని వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలోని చోటీ సద్రి ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన ఓ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. వారు తెలిపిన సమాచారం మేరకు, మృతుడు మోహిత్ (21) మానసిక స్థితి సరిగ్గా లేదు, దానికి తోడు మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. తండ్రి చనిపోయిన తరువాత మోహిత్ ఆగడాలు పెచ్చుమీరాయి. తల్లిని వేధిస్తూ ఉండేవాడు.
తనకున్న నాలుగు బీగాల భూమిని అమ్మాలని ఆమె భావించగా, సంతకం పెట్టేందుకు మోహిత్ అంగీకరించలేదు. దీంతో తల్లి ప్రేమలతా సుతార్, మోహిత్ తరచూ వెళ్లే దాబా యజమానితో డీల్ కుదుర్చుకుంది. ఆపై మరిది కిషన్ సుతార్, మహాదేవ్ ధకడ్, గణపత్ సింగ్ లతో కలసి ప్లాన్ చేసి అతన్ని చంపించింది. దాబా యజమాని గణపత్ సింగ్ కు తొలుత రూ. 50 వేలు అడ్వాన్సుగా చెల్లించిందని, దాబాకు మోహిత్ వెళ్లిన సమయంలో, ఆర్డర్ చేసిన ఫుడ్ లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి, ఆపై హత్య చేశారని పోలీసులు వెల్లడించారు.
ఈ కేసు ఛేదనలో సమీపంలోని టోల్ గేటు సీసీటీవీ ఫుటేజ్ తమకు కీలక ఆధారాలను ఇచ్చిందని తెలిపారు. నిందితులందరినీ అరెస్ట్ చేశామని, కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని వారు పేర్కొన్నారు.