vijayaya sai reddy: రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు తుంగలో తొక్కారు?: చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సూటి ప్రశ్న
- అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానీయకుండా చేసింది టీడీపీయే
- టీడీపీ లాలూచీపడి ఏపీకి తీరని అన్యాయం చేసింది
- చంద్రబాబు! ప్రజాక్షేత్రంలోకి వెళదాం రండి.. ఇదే నా సవాల్
ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారని, ప్రత్యేక హోదా సాధన విషయమై చిత్తశుద్ధి లేకుండా పోరాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు గత వారం రోజులుగా ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్టణంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని విజయసాయిరెడ్డి ఈరోజు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదా ఇచ్చినటువంటి పదకొండు రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఉద్యోగావకాశాలు ఏ విధంగా పెరిగాయనే విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా అనేది సంజీవనేనని, కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానీయకుండా చేసిన ఘనత టీడీపీదేనని, కొన్ని రాజకీయపార్టీలతో కలసి లాలూచీపడి ఏపీకి తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు.
చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ప్రజల్లోకి వెళదామని, ప్రజా తీర్పును కోరదామని అన్నారు. ఏపీ ప్రజలు నిజంగా ప్రత్యేకహోదా కోరుకుంటున్నారా? లేదా? అనేది ప్రజాతీర్పు ద్వారానే తెలుసుకుందామంటూ చంద్రబాబుకు సవాల్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.