Tollywood: ఫిల్మ్ నగరా? లేక రెడ్ లైట్ ఏరియానా? ఎలా పిలవాలో నాకు అర్థం కావట్లేదు! : సినీ నటి శ్రీశక్తి
- ఫిల్మ్ నగర్ లోని అన్ని ఆఫీసులు బ్రోతల్ హౌస్ లైపోయాయి
- సాయంత్రం ఆరు దాటితే వారి విచ్చలవిడి చేష్టలకు అంతులేదు
- ‘మా’కు తొత్తులుగా బతికే మహిళలు ఇంకా అక్కడే ఉన్నారు
- అలా పిరికి పందల్లా ఎన్నిరోజులు బతుకుతారు?
‘తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక, ఆర్థిక దోపిడి’ అనే అంశంపై హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చ నిర్వహించారు. మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చర్చలో పాల్గొన్న నటి శ్రీశక్తి (శ్రీరెడ్డి) మాట్లాడుతూ, ఫిల్మ్ నగర్ లోని అన్ని ఆఫీసులు బ్రోతల్ హౌస్ లు అయిపోయాయని, సాయంత్రం ఆరు దాటితే వారి విచ్చలవిడి చేష్టలకు అంతులేదని ఆరోపించారు.
‘నేను ఏమైనా మాట్లాడితే బూతులు మాట్లాడిందంటున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ‘బట్టలిప్పేసింది’ అని గోల చేస్తున్నారు. ఎవరి బట్టలిప్పేశాను? మీ బట్టలు ఊడదీశాను. ప్రపంచ దేశాలు నవ్వుతున్నాయి... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం ఉన్న నటి అపూర్వ అక్క మా కోసం ఈరోజు బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు. ‘మా’ సభ్యత్వం తన కొద్దని చెప్పి, అసోసియేషన్ నుంచి ఆమె బయటికి వచ్చేశారు’ అని చెప్పింది.
‘మా’కు అనుకూలంగా మాట్లాడుతున్న మహిళా ఆర్టిస్టులను ఉద్దేశించి శ్రీ శక్తి మాట్లాడుతూ, ‘మా’కు తొత్తులుగా బతికే మహిళలు ఇంకా అక్కడే ఉన్నారని, అలా పిరికి పందల్లా ఎన్నిరోజులు బతుకుతారు? అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో లొంగిపోకపోతే అవకాశాలు లేవని, అలా అని చెప్పి అందరూ అలానే లొంగిపోతారని తాను చెప్పడం లేదని, తప్పు చేయని వారు కూడా ఉన్నారని శ్రీశక్తి చెప్పింది. అయితే, తనకు ఎదురైన సంఘటనలన్నీ బాధాకరమైనవేనని, అయినప్పటికీ, తనను మోసం చేశారని తెలిపింది. తన చేతకానితనాన్ని అదునుగా తీసుకుని తనపై నిషేధం విధించారని, అందుకే మహిళా శక్తి నిద్రలేచిందని ఆమె పేర్కొంది.