Prakash Raj: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో కీలక పాత్ర పోషించనున్న ప్రకాశ్‌రాజ్!
- ప్రకాశ్ రాజ్‌కు సమన్వయకర్త బాధ్యతలు
- కరుణానిధి-కేసీఆర్ భేటీకి ప్రకాశ్ రాజ్ ఏర్పాట్లు
- వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ
- కేసీఆర్ కోరితే తెలంగాణ నుంచి కూడా..
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్‌లో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇటీవల దేవెగౌడను కలిసిన కేసీఆర్ భేటీకి ప్రకాశ్‌రాజ్‌ను కూడా తీసుకెళ్లారు. అంతేకాదు.. ప్రకాశ్‌రాజ్ తనకు అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు.
కేసీఆర్ విధానాలకు ఆకర్షితుడైన ప్రకాశ్ రాజ్ ఫెడరల్ ఫ్రంట్‌కు తన పూర్తి సహాయసహకారాలు అందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌తో కలిసి జేడీఎస్ తరపున ప్రకాశ్ రాజ్ ప్రచారం చేయనున్నట్టు చెబుతున్నారు.
తమిళనాడు చిత్ర పరిశ్రమ ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రకాశ్ రాజ్ కు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్‌తో మంచి సంబంధాలున్నాయి. త్వరలో కరుణానిధితో కేసీఆర్ భేటీకి ప్రకాశ్ రాజ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలోనే ఈ ఇద్దరు నేతలు సమావేశం కానున్నట్టు సమాచారం.
బీజేపీ, కాంగ్రెస్‌లను తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ప్రకాశ్ రాజ్ బెంగళూరులో జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యపై ఒక్కసారిగా రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. ప్రజాసంఘాలతో కలిసి లంకేశ్ హత్యపై ఉద్యమించారు. వీలుచిక్కినప్పుడల్లా బీజేపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇటీవల కేసీఆర్‌తో రోజంతా గడిపిన ప్రకాశ్ రాజ్ ఫెడరల్ ఫ్రంట్‌తోనే ఉంటానని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మంగళూరు నుంచి లోక్‌సభకు పోటీ చేసే ఉద్దేశంలో ప్రకాశ్ రాజ్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కేసీఆర్ కోరితే తెలంగాణ నుంచి కూడా పోటీ చేసేందుకు ప్రకాశ్ రాజ్ సిద్ధంగా ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.