Karnataka: ఎన్నికల వేళ కర్ణాటకలో పారుతున్న ధన, మద్య ప్రవాహం!
- మద్యం, డబ్బులను అక్రమంగా తరలిస్తున్న పార్టీలు
- తనిఖీల్లో పట్టుబడిన రూ.22,67,54,957
- ఎంసీసీ కింద 350 కేసులు నమోదు
కర్ణాటక ఎన్నికల వేళ రాష్ట్రంలో ధన, మద్య ప్రవాహం మొదలైంది. ప్రలోభాల పర్వం అప్పుడే తారస్థాయికి చేరుకుంది. ఎన్నికల కమిషన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.22 కోట్ల సొమ్ము పట్టుబడింది. అలాగే ఓ వాహనంలో తరలిస్తున్న బంగారం, రెండు కోట్ల రూపాయల విలువైన 1500 లీటర్ల మద్యాన్ని కూడా సీజ్ చేసినట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, పోలీసు బృందాలు జరిపిన దాడుల్లో మొత్తం రూ.22,67,54,957 లభ్యమైనట్టు సంజీవ్ కుమార్ వెల్లడించారు. ఇవి కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)కి సంబంధించి 350 కేసులు నమోదైనట్టు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు 67,681 ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నట్టు చెప్పారు.