apple: 'యాపిల్' సంస్థకు ఇంటి దొంగల బెడద... కీలక సమాచారం బయటకు... గట్టి హెచ్చరిక జారీ!
- గతేడాది దొరికిపోయిన 32 మంది ఉద్యోగులు
- వీరిలో 12 మంది అరెస్ట్
- బయటపెడితే ఉద్యోగం కోల్పోవడంతోపాటు జైలు శిక్ష
- హెచ్చరిస్తూ మెమో జారీ చేసిన కంపెనీ
తన ఉత్పత్తుల విషయంలో పూర్తి గోప్యత పాటించే స్మార్ట్ ఫోన్ల దిగ్గజం యాపిల్ ఉద్యోగులను ఇదే విషయంలో హెచ్చరించింది. కంపెనీకి సంబంధించి, ఉత్పత్తుల విషయమై కీలక సమాచారం బయటకు లీక్ చేస్తే సహించేది లేదని మెమో జారీ చేసింది. దీని ఆధారంగా బ్లూంబర్గ్ సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఉద్యోగులకు కంపెనీ పంపిన మెమో ఆధారంగా గమనిస్తే... 2017 సంవత్సరంలో అంతర్గత సమాచారాన్ని లీక్ చేస్తున్న 29 మంది ఉద్యోగులను యాపిల్ పట్టుకుంది. వీరిలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
‘‘గత నెలలో యాపిల్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి జరిగిన రహస్య సమావేశం వివరాలను లీక్ చేస్తుండగా ఓ ఉద్యోగిని పట్టుకున్నాం. ఆ సమావేశంలో వందలాది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. వేలాది మందికి సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు అందజేయడం జరిగింది. కానీ, ఒక ఉద్యోగి మాత్రం విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు’’ అని ఉద్యోగులకు పంపిన మెమోలో కంపెనీ పేర్కొంది.
సంస్థకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేసే ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సరఫరాదారులను ఇక ముందూ పట్టుకుని తీరుతామని హెచ్చరించింది. పట్టుబడిన వారు ఉద్యోగం కోల్పోవడమే కాకుండా, చట్టం ప్రకారం జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది.