Syria: మధ్యదరా సముద్రంలో యుద్ధనౌక 'విన్ స్టన్ చర్చిల్'... స్టెల్త్ బాంబర్లతో సిరియాపై దాడికి సిద్ధం!
- బషర్ అసద్ రసాయన దాడుల్లో చిన్నారుల మృతి
- ప్రతీకార దాడులను ఇప్పటికే ప్రారంభించిన అమెరికా
- రెండు యుద్ధ నౌకలు, భారీ ఎత్తున క్షిపణులు సిద్ధం
సిరియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని చెబుతూ అధ్యక్షుడు బషర్ అసద్ సైన్యం రసాయన ఆయుధాలను ప్రయోగించి, చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న వేళ, వెంటనే ప్రతీకార దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ సైన్యం కదిలింది. చిన్నారులు మరణిస్తున్నారన్న వార్తలు ఫొటోలతో సహా గడచిన వారం రోజులుగా మీడియాలో నిత్యమూ కనిపిస్తుంటే ట్రంప్ తట్టుకోలేకపోతున్నారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
కాగా, అమెరికా అధునాతన యుద్ధ నౌక 'విన్ స్టన్ చర్చిల్' సహా, మరో డిస్ట్రాయర్ యూఎస్ఎస్ డోనాల్డ్ కుక్, అన్ని రకాల క్షిపణులు, చాపర్లు, యుద్ధ విమానాలతో మధ్యదరా సముద్రంలో మోహరించాయి. ఈ రెండు యుద్ధనౌకల్లో 90 తొమహాక్ క్షిపణులు ఉంటాయి. గత వారాంతంలో అమెరికా ఈ క్షిపణులతోనే సిరియా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. వీటితో పాటు భూగర్భంలో ఉండే బంకర్లను సైతం ధ్వంసం చేయగల స్టెల్త్ క్షిపణులనూ అమెరికా రెడీగా ఉంచుకుంది. ఇదిలావుండగా, తమ దేశంపై జరిగే ఎటువంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటామని అసద్ ప్రభుత్వం తెలిపింది. కాగా, సిరియాకు రష్యా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే.