Hyderabad: సంచలన తీర్పు... మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులు నిర్దోషులే... కేసును కొట్టేసిన ఎన్ఐఏ కోర్టు!
- సరైన సాక్ష్యాధారాలు లేవు
- 11 ఏళ్ల విచారణ తరువాత తీర్పు
- 2007 మే 18న ఘటన
- పేలుడులో మరణించిన 9 మంది
- హైదరాబాద్ లో భారీ బందోబస్తు
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో మొత్తం నిందితులంతా నిర్దోషులేనని గడచిన 11 సంవత్సరాలుగా కేసును విచారిస్తున్న ఎన్ఐఏ కోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పిచ్చింది. వీరెవరిపైనా సరైన సాక్ష్యాలను అందించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
కాగా, 2007 మే 18న మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో చార్మినార్ సమీపంలోని మక్కామసీదు ఆవరణలో ప్రార్థనలు జరుగుతున్న వేళ, వజూఖానా వద్ద ఐఈడీ (ఇంప్రోవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్) బాంబును పేల్చడంతో, 9 మంది మరణించగా, 58 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. అక్కడికి సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. ఆపై ముస్లింలు నిరసనలు తెలుపుతుండగా, వాటిని అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు.
ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ, ఎన్ఐఏ, జూన్ 17, 2010న రాజస్థాన్‌కు చెందిన దేవేంద్రగుప్తా అలియాస్ బాబీ, మధ్యప్రదేశ్‌కు చెందిన లోకేశ్ శర్మ అలియాస్ అజయ్ తివారిలను అరెస్ట్ చేశారు. ఆపై అదే సంవత్సరం నవంబరులో కీలక నిందితుడు నాటకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానంద పోలీసులకు పట్టుబడడంతో మొత్తం ఘటన వెనకున్న కుట్ర కోణం వెలుగు చూసింది.
విచారణలో కీలక ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ, ఒక వర్గం ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మరో వర్గం పేలుళ్లకు పాల్పడుతోందనే కారణంతో మక్కామసీదు పేలుడు ఘటనకు పాల్పడినట్లు తన చార్జ్ షీట్ లో పేర్కొంది. ఆపై ఈ కేసుతో సంబంధం ఉందని ఆరోపిస్తూ, గుజరాత్ లోని వల్సాద్ కు చెందిన భారత్ మోహన్ లాల్ రతేశ్వర్ అలియాస్ భారత్ భాయిని, మధ్యప్రదేశ్ కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ లను కూడా అరెస్ట్ చేశారు.
ఆపై కేసులో ప్రమేయముందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇండోర్ కు చెందిన సందీప్ వి డాంగే, రామచంద్ర కల్సంగ్రా రాంజీ అలియాస్ ఓమ్ జీలు ఇప్పటికీ పట్టుబడలేదు. మరో కీలక నిందితుడు సునీల్ జోషి హత్యకు గురయ్యాడు. ఇంత కాలానికి కేసు తీర్పు నిందితులకు అనుకూలంగా వెలువడటం గమనార్హం.