aiims: ఎయిమ్స్ లో 'శంకర్ దాదా ఎంబీబీఎస్'... 5 నెలలుగా డాక్టర్ గా చలామణి!
- వైద్యులను బురిడీ కొట్టించిన అద్నాన్
- మారధాన్ లో అతని వ్యవహార శైలిపై వైద్యులకు అనుమానం
- పోలీసులకు ఫిర్యాదు, అరెస్టు
ఢిల్లీ ఎయిమ్స్ లో నకిలీ వైద్యుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే... బీహార్ కు చెందిన అద్నాన్ ఖుర్రం (19) గత ఐదు నెలలుగా వైద్యుడిగా చలామణి అవుతున్నాడు. ఎయిమ్స్ లో కొందరు వైద్యులకు తాను జూనియర్ రెసిడెంట్ వైద్యుడినని, జూనియర్ రెసిడెంట్ వైద్యులకు తాను మెడికల్ స్టూడెంట్ నని చెబుతూ పరిచయం పెంచుకునేవాడు. ఇలా ఐదు నెలలుగా మభ్యపెడుతూ వైద్యుడిగా చలామణీ అవుతున్నాడు. ఆసుపత్రిలోని మెడికల్ విద్యార్థులు పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ పాలు పంచుకునేవాడు.
ధర్నాలు, మారధాన్ లు ఇలా వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. అయితే శనివారం ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన మారథాన్ సందర్భంగా కొందరు వైద్యులకు అద్నాన్ పై అనుమానం వచ్చింది. దీంతో అతనిని నిలదీయగా, పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు, మందులపై అతడికున్న అవగాహన, ఎయిమ్స్‌లో వైద్యుల పేర్లు, ఇతర విభాగాలకు సంబంధించి అతని వద్దనున్న సమాచారం చూసి షాక్ తిన్నారు.
అయితే అతనికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని బాట్లా హౌస్ సమీపంలో ఉంటున్న అద్నాన్ సోషల్ మీడియా ఖాతాలో తెల్లకోటు, స్టెతస్కోప్ పట్టుకుని దిగిన చాలా ఫొటోలు ఉన్నాయని తెలిపారు. తన కుటుంబసభ్యుడొకరికి మంచి వైద్యం అందించడానికి తాను ఇలా వైద్యుడి అవతారం ఎత్తానని ఒకసారి, తనకు వైద్యులతో సమయం గడపడం చాలా ఇష్టమని మరోసారి, వైద్యుడిని కావాలని అనుకున్నానని ఇంకోసారి చెబుతూ పోలీసులను అయోమయానికి గురి చేస్తున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్టు వారు తెలిపారు.