Chandrababu: బంద్ వల్ల ఆర్టీసీకి రూ.12 కోట్ల నష్టం: చంద్రబాబు
- సమావేశమైన టీడీపీ సమన్వయ కమిటీ
- ఈ రోజు దుకాణాలు మూత పడ్డాయన్న చంద్రబాబు
- చాలా మంది ఉపాధి కోల్పోయారని వ్యాఖ్య
- రాష్ట్రానికి ఎంత నష్టమో విపక్షాలు ఆలోచించాలని హితవు
ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు బంద్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. బంద్ వల్ల ఆర్టీసీకి రూ.12 కోట్ల నష్టం వచ్చిందని, 65 లక్షలమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దుకాణాల మూత వల్ల ఈ రోజు చాలా మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. రాష్ట్రానికి ఎంత నష్టమో విపక్షాలు ఆలోచించాలని, రాష్ట్రానికి నష్టం చేకూర్చకూడదని అన్నారు. ఈ రోజు అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 21 నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్ యాత్రలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. చరిత్రలో గతంలో జరగని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేశామని, ఆ విషయాన్ని కూడా ప్రజలకు తెలపాలని, సైకిల్ యాత్ర ప్రజల్లో కదలిక తీసుకురావాలని అన్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని చెప్పారు.