mla r krishnaiah: సిని హీరోలంతా నిజజీవితంలో కుక్కను చూస్తే చాలు పారిపోతారు!: ఆర్. కృష్ణయ్య తీవ్ర వ్యాఖ్యలు
- హీరోలకు ధైర్యం, శక్తి, తెలివితేటలు లేవు
- సినీ స్టూడియోల్లో ఏం జరుగుతుందనే దానిపై పర్యవేక్షణ లేదు
- సినిమా మంత్రిత్వ శాఖకు అసలు పట్టింపే లేదు
- ఇక్కడ జరుగుతున్న అకృత్యాలపై ప్రభుత్వం ఓ కమిటీ వేయాలి
తెలుగు సినీ పరిశ్రమపైన, హీరోలపైన టీ-టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రెండో రోజు సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ సమావేశంలో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ, హీరోలకు ధైర్యం, శక్తి, తెలివితేటలు లేవని, నిజజీవితంలో కుక్కను చూస్తే చాలు.. వారు పారిపోతారని ఎద్దేవా చేశారు.
సినీ స్టూడియోల్లో ఏం జరుగుతుందనే దానిపై పర్యవేక్షణ లేదని, ఈ విషయంలో సినీ మంత్రిత్వ శాఖకు అసలు పట్టింపు లేదని మండిపడ్డారు. సినీ పరిశ్రమలో కనిపించని వివక్ష, దోపిడీ, పీడన కొనసాగుతున్నాయని, ఇక్కడ జరుగుతున్న అకృత్యాలపై ప్రభుత్వం ఓ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు సినీ హీరోల వద్ద వందల ఎకరాల భూములు ఉన్నాయి
సమాజాన్ని ప్రభావితం చేసే ‘సినిమా’ బలమైన సాధనమని, తెరవెనుక జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలు సినీ పరిశ్రమకు సిగ్గుచేటని దుయ్యబట్టారు. తెలుగు సినీ హీరోల వద్ద వందల ఎకరాల భూములు ఉన్నాయని, మర్యాదగా ఇస్తే ఏమీ కాదని, లేదంటే ఆ భూముల్లో గుడిసెలు వేయిస్తామంటూ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.