Drunk Driving: డ్రంకెన్ డ్రైవ్ చేస్తున్న పోలీసులపై తిట్లు... నడుస్తూ వచ్చి రెచ్చిపోయిన తల్లీ కొడుకులు!
- హైదరాబాద్ శివార్లలో ఘటన
- విధుల్లో ఉన్న పోలీసులపై తిట్ల పురాణం
- మా డబ్బుతో మేము తాగుతుంటే మీకేంటి? అంటూ ప్రశ్న
- అప్పటికి వదిలేసి, తరువాత అరెస్ట్ చేసిన పోలీసులు
సాధారణంగా మందు కొట్టి వాహనాలు నడుపుతూ, తమను అడ్డుకున్న పోలీసులను దూషిస్తూ నానా హంగామా చేసే వారిని నిత్యమూ చూస్తుంటాం. ఈ విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలు మరో అడుగు ముందున్నారని స్వయంగా పోలీసులే అంగీకరిస్తుంటారు కూడా. ఒక్కోసారి మందు బాబులను కట్టడి చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతుంటారు. అయితే, ఇది మాత్రం ఓ అరుదైన ఘటన. ఏ వాహనంపైనా లేకుండా, నడుస్తూ వచ్చిన ఓ తల్లీ, కొడుకు పోలీసులపై తిట్ల పురాణానికి దిగిన ఘటన హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ లో జరిగింది.
ఇక్కడి ఆరాంఘర్ చౌరస్తాలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుంటే, శంషాబాద్ మండలానికి చెందిన చెన్నమ్మ, ఆమె కుమారుడు శ్రీశైలం అటుగా వచ్చారు. పోలీసులను చూసిన వీరు "మా డబ్బుతో మేము తాగుతుంటే మీకేంటి?" అంటూ రెచ్చిపోయారు. పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. వీరిద్దరూ మద్యం మత్తులోనే ఉండటంతో అప్పటికి చేసేదేమీ లేక వారిని పంపించిన పోలీసులు, సోమవారం నాడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు.