swedan: స్వీడన్ లో భారత ప్రధానికి అపూర్వ స్వాగతం
- విమానాశ్రయానికి విచ్చేసిన స్వీడన్ ప్రధాని స్టీఫెన్
- ఇద్దరూ కలసి ఒకే కారులో హోటల్ కు పయనం
- పలు ద్వైపాక్షిక అంశాలపై నేడు చర్చలు
భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వీడన్ లో ఘన స్వాగతం లభించింది. స్టాక్ హోమ్ లోని విమానాశ్రయంలో భారత ప్రధాని మోదీకి స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫ్ వెన్ ఎదురేగి అపూర్వ స్వాగతం పలికారు. 30 ఏళ్ల కాలంలో స్వీడన్ ను సందర్శిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడంతో ఈ పర్యటన పట్ల ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని స్వీడన్ తర్వాత బ్రిటన్ లో జరిగే కామన్వెల్త్ దేశాల సమావేశానికి హాజరుకానున్నారు.
మోదీకి స్వాగతం పలికిన అనంతరం ఇరు ప్రధానులు ఒకే కారులో హోటల్ కు చేరుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, శుద్ధ ఇంధనం తదితర రంగాల్లో రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు కోరుకుంటున్నట్టు స్వీడన్ కు బయల్దేరే ముందు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రోజు ఇరు దేశాధినేతలు వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. రెండు దేశాల వ్యాపారులతో సమావేశమవుతారు. ఏ ఏ రంగాల్లో సహకారానికి వీలున్నదనే అంశంపై చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా మోదీ స్వీడన్ రాజు కార్ల్ గుస్టఫ్ తోనూ భేటీ అవుతారు. రెండు దేశాల ఆధ్వర్యంలో స్టాక్ హోమ్ లో ఓ సదస్సు జరగనుంది.