Telangana: 'మక్కా మసీదు పేలుళ్ల కేసు' తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిది : బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి
- దేశంలో మతకలహాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం
- కాషాయ ఉగ్రవాదంగా ముద్ర వేయాలని చూసింది
- దేశ చరిత్రను మంట గలిపేలా నాడు ‘కాంగ్రెస్’ వ్యాఖ్యలు చేసింది
దేశంలో మతకలహాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని తెలంగాణ బీజేఎల్పీ నాయకుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మక్కా మసీదు పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, నాటి బాంబు పేలుళ్లను హిందూ తీవ్రవాదంగా, కాషాయ ఉగ్రవాదంగా ముద్ర వేయాలని కాంగ్రెస్ నాయకులు చూశారని, నిన్న వెలువడిన కోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిదని అన్నారు. దేశ చరిత్రను మంట గలిపే విధంగా నాడు కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు చేసిందని దుయ్యబట్టారు.
కోర్టులో వాదనలు, సాక్ష్యాల ఆధారంగానే తీర్పు చెబుతారే తప్ప, మనుషులను, ప్రాంతాలను చూసి తీర్పు చెప్పరని అన్నారు. దళితులను ఊచకోత కోసింది కాంగ్రెస్ పార్టీయేనని, దేశంలో ఎక్కడ అల్లర్లు, ఉగ్రవాద మూకలు చెలరేగినా దాని మూలాలు హైదరాబాద్ లోనే ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఎంఐఎంపై ఆయన మండిపడ్డారు. అఫ్జల్ గురుపై ఇచ్చిన తీర్పు వెనుక మన్మోహన్ సింగ్ ఉన్నారా? కసబ్ తీర్పు వెనుక సోనియాగాంధీ ఉన్నారా? అని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీకి న్యాయవ్యవస్థపై, పోలీస్ వ్యవస్థపై గౌరవం లేదని విమర్శించారు.