Nara Lokesh: 'కళ్లు తెరవండి'... అరుణ్ జైట్లీ ట్వీట్‌పై మండిపడ్డ నారా లోకేశ్
- నగదు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉందని జైట్లీ ట్వీట్
- వాస్తవ పరిస్థితులను అంచనా వేయలేదన్న లోకేశ్
- జైట్లీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం బాధాకరమని కౌంటర్
దేశంలో కరెన్సీ పరిస్థితులపై సమీక్ష జరిపామని, కావాల్సిన దానికంటే ఎక్కువ నగదే చలామణిలో ఉందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ట్వీట్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వరసగా ట్వీట్లు చేశారు. వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా అంతా బాగుందని అంటున్నారని, అరుణ్ జైట్లీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం బాధాకరమని అన్నారు.
ఏపీలో నగదు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఇప్పటికే సీఎం చంద్రబాబు లేఖ రాసినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరచి నగదు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.