jeevitha: రాజశేఖర్ అమ్మాయిల పిచ్చోడని, జీవిత బ్రోకర్ పని చేస్తుందని అంటారా? .. కోర్టుకెళతా!: జీవిత ఆగ్రహం
- మహాటీవీలో వచ్చిన ఓ వీడియో క్లిప్ చూశాను
- సామాజిక కార్యకర్త సంధ్య నాపై ఆరోపణలు చేసింది
- న్యూస్ ఎడిటర్ ఇది నిజమేనన్నట్లు ప్రకటించాడు
- సంధ్య కూడా ఓ మహిళే
టీవీల్లో కాస్టింగ్ కౌచ్‌పై చర్చలు జరుగుతుంటే చాలా అసహ్యంగా, ఛీప్‌గా అనిపించిందని, తనను మాట్లాడడానికి రమ్మని పిలిచినా వెళ్లలేదని సినీ నటి, ప్రొడ్యూసర్ జీవిత రాజశేఖర్ అన్నారు. తనపై వస్తోన్న ఆరోపణలపై జీవిత ఈ రోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అసలు ఎవరికి ఏం కావాలని ఫైట్ జరుగుతోందని ఆమె ప్రశ్నించారు. కొన్ని రోజుల ముందు తాను మహాటీవీలో వచ్చిన ఓ వీడియో క్లిప్ చూశానని, సామాజిక కార్యకర్త సంధ్య ఛానెల్‌తో మాట్లాడుతూ తనపై నీచమైన ఆరోపణలు చేశారని అన్నారు.
సంధ్య మహిళల కోసం పోరాడుతుందని అందరూ అంటారని, సంధ్య కూడా ఒక మహిళ అని, అటువంటి ఆమె ఇంత దారుణంగా ఎలా ఆరోపణలు చేస్తుందని జీవిత ప్రశ్నించారు. తాను హాస్టల్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి రాజశేఖర్ వద్దకు పంపుతున్నానని ఆమె అందని, మహాన్యూస్‌లో మూర్తి అనే ఎడిటర్ ఆ చర్చ జరిపేసి, చివరకు హైదరాబాద్, అమీర్‌పేటలోని హాస్టల్‌లోని అమ్మాయిలను తాను రాజశేఖర్ వద్దకు పంపుతున్నానని వారికి వారే తేల్చేసినట్లు ప్రకటించుకున్నారని ఆమె విమర్శించారు.
యూట్యూబ్ ఛానెల్ లోనూ పెట్టారు..
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో హాస్టల్‌లోని అమ్మాయిలను తాను రాజశేఖర్ వద్దకు పంపుతున్నానని టీవీలో చర్చలు జరిపి, మళ్లీ యూట్యూబ్ ఛానెల్‌లోనూ ఆ వీడియోను పెట్టారని జీవిత అన్నారు. ఆ ఒక్క యూట్యూబ్ ఛానెల్ వల్ల వందల యూట్యూబ్ ఛానెళ్లు కూడా ఇదే వార్తను రకరకాల హెడ్డింగులు పెట్టి ఇస్తున్నాయని అన్నారు. రాజశేఖర్ అమ్మాయిల పిచ్చోడని, జీవిత బ్రోకర్ పని చేస్తుందని అందులో పేర్కొంటున్నారని జీవిత వాపోయారు.
"సంధ్యని నేరుగా అడుగుతున్నాను.. మీరు ఏదైనా మాట్లాడుకోండి. నన్ను చాలా మంది మహిళలు ఇష్టపడుతారు.. ఆంధ్రరాష్ట్రం మొత్తం నన్ను సొంతింటి ఆడపడుచులా చూస్తుంది. ఒక ఆడదానిపై ఒక మహిళ వేయవలసిన ఆరోపణలు ఇలాగేనా ఉండేవి? నాకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. నాది గొప్ప కుటుంబం.. రాజశేఖర్ కుటుంబం అంటే ఐఏఎస్, ఐపీఎస్‌ల కుటుంబం. మాపై వేసిన ఆ ఆరోపణలను రుజువు చేయాల్సిందే. ఏ ఆధారాలతో ఇలా మాట్లాడుతున్నారో ప్రజలు కూడా ఆలోచించాలి.
సెలబ్రిటీల గురించి ఎన్నో సార్లు సంధ్య ఇటువంటి వ్యాఖ్యలు చేసింది, సినిమా వాళ్లంటేనే ఆమె ఛీప్‌గా వ్యాఖ్యలు చేస్తుంది. తమాషాగా ఉందా, మమ్మల్ని చూస్తే? నేను ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేశాను. కోర్టుకి వెళతాను.. పరువు నష్టం దావా వేస్తాను. మేము ఓ ఫిర్యాదు ఇచ్చాక యూట్యూబ్‌లోంచి ఆ వీడియోలను తీసేస్తారు. సంధ్య విడాకులు తీసుకున్నారని తెలిసింది. మీకు కుటుంబం ఉందో లేదో తెలియదు. పిల్లలు ఉన్నారో, లేరో తెలియదు.. ఇటువంటి ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తున్నారు" అని జీవిత వ్యాఖ్యానించారు.