tripura: త్రిపుర ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నవ్వుకుంటున్న నెటిజన్లు!
- మహాభారత కాలం నాటికే ఇంటర్నెట్ మనకు ఉంది
- భారత యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు
- అది ఇంటర్నెట్ వల్లే సాధ్యమైంది
మహాభారత కాలం నాటికే ఇంటర్నెట్, ఉపగ్రహ వ్యవస్థ మనకు అందుబాటులో ఉన్నాయంటూ త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై జోక్స్ పేలుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త్రిపుర రాజధాని అగర్తాలాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, మహాభారత సంగ్రామంలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో సంజయుడు ధృతరాష్ట్రుడికి తెలియజేశాడని, అది ఇంటర్నెట్ వల్లే సాధ్యమైందని, ఈ టెక్నాలజీ అప్పట్లోనే అందుబాటులో ఉందనే విషయం మనకు తెలియలేదని అన్నారు.
ఇంటర్నెట్ ను పాశ్చాత్యదేశాలు కనుగొన్నాయని భావించే ప్రతిఒక్కరూ లక్షల సంవత్సరాల క్రితమే ఈ టెక్నాలజీని భారత్ వినియోగించిందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఇటువంటి దేశంలో జన్మించడం తనకు గర్వకారణంగా ఉందని, ఇంటర్నెట్ వంటి అద్భుత సాంకేతికతను దేశ ప్రజలకు మోదీ అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు.
కాగా, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు పలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ‘తెలివి తక్కువ వ్యాఖ్యలు’, ‘మరి, ఆ కాలంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు ఎలా వెనక్కి రావాలో అడగలేదు, ఎందుకుని?’ అంటూ ప్రశ్నించారు.