NEET: దుస్తులు ‘నీట్’గా ఉండాల్సిందే.. డ్రెస్‌కోడ్‌పై అభ్యర్థులకు సీబీఎస్ఈ ఆదేశాలు!
- తేలిక పాటి రంగులున్న దుస్తులనే ధరించాలి
- ఫుల్ చేతులున్న దుస్తులకు అనుమతి లేదు
- తమకు నచ్చిన డ్రెస్ ధరించాలనుకుంటే మాత్రం గంట ముందే రావాలి
- మే 6న దేశవ్యాప్తంగా ‘నీట్’
నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు హాజరయ్యే విద్యార్థులు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆదేశాలు జారీ చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తేలికపాటి రంగులున్న హాఫ్ చేతుల దుస్తులు మాత్రమే ధరించాలని సూచించింది. షూ ధరించరాదని పేర్కొంది. ఒకవేళ వారు తమకు ఇష్టమైన దుస్తులు ధరించాలంటే మాత్రం పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
సీబీఎస్ఈ తాజా ఆదేశాల ప్రకారం అభ్యర్థులు తేలికపాటి దుస్తులు ధరించాలి. వాటికి పెద్దపెద్ద గుండీలు, బ్యాడ్జీలు, పువ్వులు తదితరాలు ఉండకూడదు. అలాగే అతి తక్కువ ఎత్తున చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లు వేసుకోకూడదు. మే 6న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. ఆ రోజు ప్రభుత్వ సెలవు దినమైనా తేదీలో ఎటువంటి మార్పు ఉండదని సీబీఎస్ఈ తేల్చి చెప్పింది.
విద్యార్థులు వెంట తీసుకొచ్చే వస్తువులను భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదని, కాబట్టి సెల్ఫోన్లు తదితర వాటిని తీసుకురావద్దని సూచించింది. అలాగే, జామెట్రీ/పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, బెల్ట్, క్యాప్, వాచ్, మెటాలిక్ వస్తువులను అనుమతించబోమని పేర్కొంది.