Narendra Modi: నా ఫిట్ నెస్ రహస్యం 'స్పెషల్ డైటే'.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- రోజూ రెండు కేజీల విమర్శలు తీసుకుంటున్నాను
- విమర్శలు ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి మేలు చేస్తాయి
- విమర్శలకు బాధపడలేదు
గత 20 ఏళ్లుగా తాను ప్రత్యేకమైన ఆహారపుటలవాట్లను అనుసరిస్తుండడంతో ఆరోగ్యంగా ఉన్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న మోదీ లండన్ లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయనను ప్రవాసులు ప్రశ్నలడిగారు. ఫిట్ నెస్ కోసం ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను గత 20 ఏళ్లుగా రోజూ 2 కేజీల విమర్శలు స్వీకరిస్తున్నానని, అదే తన ఫిట్ నెస్ రహస్యమని చమత్కరించారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి విమర్శలు మేలుచేస్తాయని ఆయన చెప్పారు. విమర్శలను స్వీకరిస్తుంటానని చెప్పిన ఆయన, వాటికి ప్రాధాన్యత కూడా ఇస్తానని అన్నారు.
అలాగని విమర్శలకు బాధపడింది కూడా లేదని చెప్పారు. తనను విమర్శించాలని ఆయన కోరారు. విమర్శకుల కారణంగా తామెప్పుడూ అప్రమత్తంగా ఉంటామని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు విమర్శలు ఆరోపణల స్థాయికి దిగజారిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశప్రజల స్వేచ్ఛ కోసం గాంధీ ఉద్యమం చేస్తే, తాను అభివృద్ధిని ప్రజాఉద్యమంగా మార్చానని తెలిపారు. తాను వెనుకబడిన వర్గం నుంచి వచ్చి, పేదరికంలో జీవించానని, అందుకే దేశ ప్రజల అవసరాలు తనకు తెలుసని ఆయన చెప్పారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి పని చేయాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు.