tammareddy bharadwaja: మీ తిట్లు వింటుంటే అసహ్యం వేస్తోంది.. ఇప్పటికైనా కలిసి చావండి!: టీడీపీ, వైసీపీలపై తమ్మారెడ్డి ఫైర్
- మీ తిట్లను వినడానికి కాదు మేము ఉన్నది
- రాజీనామాలు చేసి వెళ్లిపోండి
- రాష్ట్రాన్ని మేమే చూసుకుంటాం
తాను ఏ రాజకీయపార్టీకి చెందినవాడిని కాదని... తెలుగు ప్రజల శ్రేయస్సే తనకు కావాలని సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. టీడీపీ వాళ్లు వైసీపీ వాళ్లను తిడతారని, వైసీపీ వాళ్లు టీడీపీ వాళ్లను తిడుతూ ఉంటారని... నిజంగా వీరికి చిత్తశుద్ధి ఉంటే ఒకరినొకరు తిట్టుకోరాదని ఆయన సూచించారు. 'మీ తిట్లను వినడానికి కాదు కదా మేమంతా ఉన్నది' అంటూ అసహనం వ్యక్తం చేశారు. మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఓట్లు వేశామని... రెండు పార్టీలూ దొంగలే అని... వాళ్ల తిట్లు వింటుంటే అసహ్యం వేస్తోందని మండిపడ్డారు.
'మీ రెండు పార్టీలు రాజీనామాలు చేసి వెళ్లిపోండప్పా... మేమే చూసుకుంటాం... అది మాత్రం మీరు చేయరు... పదవులను పట్టుకుని వేలాడుతూ, ఒకరినొకరు తిట్టుకుంటూ సమయాన్ని గడిపేస్తారు' అని తమ్మారెడ్డి అన్నారు. నాలుగేళ్లు గడిచిపోయాయి... ఈ సంవత్సరమన్నా కలిసి చావండి, రాష్ట్రానికి బాగుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు ఢిల్లీలో తొత్తులంటూ ఒక పార్టీ... నాలుగేళ్లుగా మీరు సంసారం చేశారంటూ మరొక పార్టీ... రాష్ట్ర సమస్యలను వదిలేసి రోజూ ఇదే పనేనా? అంటూ మండిపడ్డారు. 'ఇప్పటికైనా అందరూ కలిసి చావండి... రాష్ట్రం బాగుపడుతుంది' అంటూ తమ్మారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.