adr: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో ఎక్కువ మంది బీజేపీ ప్రజాప్రతినిధులే!: ఏడీఆర్ నివేదిక
- మహిళలపై అకృత్యాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై నివేదిక
- దేశ వ్యాప్తంగా 1,580 మంది చట్టసభ సభ్యులపై క్రిమినల్ కేసులు
- 48 మంది ప్రజాప్రతినిధులపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు
మహిళలపై అకృత్యాలకు పాల్పడిన ఘటనల వెనుకనున్న ప్రజాప్రతినిధులపై నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ)తో కలిసి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను తయారు చేసేందుకు ఎన్నికల సమయంలో 768 మంది ఎంపీలు, 4077 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన మొత్తం 4,845 ప్రమాణ పత్రాలను విశ్లేషించింది.
వీటి ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 1,580 (33%) మందిపై క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. వారిలో ముగ్గురు ఎంపీలు సహా 48 మంది వరకు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. వీరిలో అత్యధికులు బీజేపీకి చెందిన వారని ఈ నివేదిక వెల్లడించింది. 12 మంది బీజేపీ నేతలు, ఏడుగురు శివసేన నేతలు, ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన వారు ఉన్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.
రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 12 మంది ప్రజాప్రతినిధులు ఉంటే, తరువాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ (11), ఒడిశా, ఆంధ్రప్రదేశ్ (5)లు ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. గత ఐదేళ్లలో మహిళలపై నేరాల కేసులు ఎదుర్కొంటున్న 327 మందికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో కూడా బీజేపీ (47)దే అగ్రస్థానం. ఆ తరువాత బీఎస్పీ (35), కాంగ్రెస్ (24) స్వతంత్రులు 118 మంది ఉన్నారు. వీరిలో రాజకీయ పార్టీలకు చెందిన 26 మంది, స్వతంత్రులు 14 మందిపై అత్యాచారం కేసులున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.