Pawan Kalyan: నేను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడే ముందుకెళ్తున్నాను: పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
- చనిపోవడానికి సిద్ధపడితే ఓటమి భయం ఉంటుందా?
- వివాదాల్లోకి లాగిన తరువాత పరువు పోతుందని భయపడతారా?
- చనిపోవడానికే సిద్ధపడితే దేనికైనా వెనుకంజ వేస్తాడా?
ఈ రోజు నుంచి ఏ క్షణంలో అయినా చనిపోవడానికి సిద్ధపడే ముందుకు వెళ్తున్నాను అంటూ ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. జనసైనికులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళ్తే.. ‘స్వశక్తితో జీవించే వాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు చనిపోవడానికి సిద్ధపడితే ఓటమి భయం ఉంటుందా?.. ఆత్మగౌరవంతో బతికే వాళ్లని, సంవత్సరాలుగా సంబంధం లేని వివాదాల్లోకి పదేపదే లాగిన తరువాత పరువుపోతుందని భయపడతారా?... అధికారంలో ఉన్నవాళ్లకి, మీడియాని చేతుల్లో పెట్టుకున్న వారికి, అంగబలం, అర్థబలం ఉన్నవారికి, వారు చేసే అత్యాచారాలకి, స్వశక్తితో జీవించే వాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడితే అసలు దేనికైనా భయపడతాడా? వెనుకంజ వేస్తాడా?..
అందుకే నా ప్రియమైన అక్కచెళ్లెళ్లు, ఆడబడుచులు, జనసేనను ఆదరించే ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నుంచి ఏ క్షణంలో అయనా చనిపోవడానికి సిధ్ధపడి ముందుకు వెళ్తున్నాను. ఒకవేళ ఈ పోరాటంలో నేను చనిపోతే మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే..నిస్సహాయులకు అండగా, అధికారపు అండదండలు ఉన్నవారికే పనిచేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలకు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడనుకుంటే చాలు’ అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.