Pawan Kalyan: మీ స్థాయి వ్యక్తులు ఇలా దిగజారినప్పుడు.. అలాంటి నీచులు, నికృష్టులు ఎందుకు ఉండరు?: పవన్ కల్యాణ్
- సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండి దిగజారారు
- తప్పుడు పదం అనమని సలహా ఇచ్చి, అనిపించి, పదేపదే ప్రసారం చేశారు
- అత్యాచారాలు చేసే నీచులు నికృష్టులు కోకొల్లలుగా ఉంటారు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మీడియా తీరుపై తీవ్ర స్థాయిలో ట్విట్టర్ మాధ్యమంగా ధ్వజమెత్తిన ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ మరో ట్వీట్ లో దర్శకుడు రాంగోపాల్ వర్మ, మీడియా ప్రతినిధుల తీరుతెన్నులను ఎండగట్టాడు. ఆ ట్వీట్ లో... 'మీకు చదువులు ఉండి, విజ్ఞత ఉండి, కుటుంబాలు ఉండి, అక్కాచెల్లెళ్లు ఉండి, కోడళ్లు, కూతురులు ఉండి పేరు ప్రఖ్యాతలు ఉండి, సంపదను కూడబెట్టుకొని అన్నింటికి మించి సమజాన్ని ప్రభావితం చేసే స్థాయిల్లో (మీడియా) మాధ్యమాలల్లో ఉన్న మీరు అందరు కలిసి ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మహిళను, భర్త, పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నా కన్నతల్లిని... ఎవరికి ఉపకారం తప్ప అపకారం అనేది ఆలోచనల్లో కూడా చెయ్యని నాకు జన్మనిచ్చిన తల్లిని మీరందరు కలిసి నడిరోడ్డులో ఏ కొడుకు కూడా వినకూడని ఒక తప్పుడు పదాన్ని అనమని సలహాలు చెప్పి, అనిపించి, దానిని పదే పదే ప్రసారం చేసి, ఆ తర్వాత దానిపైన డిబేట్లు చేసే స్థాయికి మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారగలిగినప్పుడు... "అసిఫా" లాంటి ముక్కుపచ్చలారని పసిపిల్లలను, అభం శుభం తెలియని పసిపిల్లలపై దారుణమైన అత్యాచారాలు చేసే నీచులు నికృష్టులు ఎందుకు ఉండరు? కొల్లలుగా ఉంటారు... మీరందరు కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా... మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి, మీ అక్కచెల్లెళ్లకు, మీ కూతురులకి, కోడళ్ళకి మీ ఇంటిల్లిపాదికి నా హృదయపూర్వక వందనాలు' అంటూ పవన్ ట్వీట్ చేశారు.