drones: అమెరికా నుంచి కిల్లర్ డ్రోన్స్ ను కొనుగోలు చేయనున్న భారత్!
- సరిహద్దుల్లో గస్తీ కోసం యూఏవీల కొనుగోలు
- పాక్, చైనాలతో సరిహద్దుల్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు యూఏవీల కొనుగోళ్లు
- ప్రిడేటర్ బి డ్రోన్లను కొనుగోలు చేయనున్న భారత్
ఆయుధ విక్రయ చట్టంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. కిల్లర్ డ్రోన్స్ ను కీలక భాగస్వామ్య దేశాలకు విక్రయించేందుకు అమెరికా అధ్యక్షుడు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు చట్టంలో మార్పులు చేసి, కీలక భాగస్వామ్య దేశాలకు కిల్లర్ డ్రోన్స్ గా పిలుచుకునే అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ) లను అమెరికా విక్రయించనున్నట్టు సమాచారం.
ఈ డ్రోన్స్ ను భారత్ కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. వీటిని కొనుగోలు చేయడం ద్వారా సరిహద్దుల్లో పాక్, చైనాలతో ఎదురవుతున్న సవాళ్లకు చెక్ చెప్పొచ్చని భారత్ భావిస్తోంది. టెర్రరిస్టు చొరబాట్లను కూడా అడ్డుకోవడంలో ఈ కిల్లర్ డ్రోన్స్ ప్రభావంతమైన పాత్ర పోషిస్తాయని భారత్ ఆశిస్తోంది. అంతే కాకుండా 22 ప్రిడేటర్ బి డ్రోన్లను కొనుగోలు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ డ్రోన్ల ద్వారా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయొచ్చని భారత్ భావిస్తోంది. అంతర్జాతీయ న్యాయ చట్టాలను అనుసరించి, దేశ రక్షణలో వీటిని వినియోగించొచ్చునని సమాచారం.