Pawan Kalyan: పవన్‌పై న్యాయ పోరాటానికి సిద్ధమైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ
- తన తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను పదేపదే ప్రసారం చేశారన్న పవన్
- వీడియో చూడకుండానే పవన్ తొందరపడ్డారంటున్న ఏబీఎన్
- రూ. పది కోట్లకు పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధం
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తనపైన, తన చానల్ పైన చేసిన ఆరోపణలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌పై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా క్రిమినల్ కేసుతోపాటు రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేయడానికి సిద్ధమవుతున్నారు.
సినీ నటి శ్రీరెడ్డి తన తల్లిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను పలు చానళ్లు పదేపదే ప్రసారం చేశాయన్నది పవన్ ఆరోపణ. ఆయన చేసిన వ్యాఖ్యలతో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శుక్రవారం ఫిల్మ్ చాంబర్ వద్ద పవన్ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన ఏబీఎన్ వాహనాలపై ఆయన అభిమానులు దాడి చేశారు. రెండు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆంధ్రజ్యోతి సిబ్బంది గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది.
పవన్ ఆరోపణలపై స్పందించిన ఏబీఎన్ ... తాము జర్నలిజం ప్రమాణాలను పాటించామని చెబుతోంది. పవన్ తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను మ్యూట్ చేశామని చెబుతోంది. పవన్ అనవసరంగా తొందరపడ్డారని, ఆ వీడియో చూసి మాట్లాడితే బాగుండేదని ఏబీఎన్ అభిప్రాయపడింది. మరోవైపు పవన్ ఆరోపణలు చేసిన శ్రీని రాజు కూడా నేడు పవన్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పవనే స్వయంగా ప్రకటించారు.