Raj Tarun: హీరో రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష
- ఎస్బీఐ లో క్యాషియర్ గా పని చేసిన రాజ్ తరుణ్ తండ్రి
- నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణం
- విచారణ అనంతరం జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా
ప్రముఖ సినీ హీరో రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ, విశాఖపట్నం రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సన్నీ పర్విన్ సుల్తానాబేగం తీర్పిచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్ గా 2013 ప్రాంతంలో పని చేసిన ఆయన, నకిలీ బంగారాన్ని కుదవపెట్టి రుణం పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి.
తన భార్య రాజ్యలక్ష్మితో పాటు, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురి పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించిన ఆయన రూ. 9.85 లక్షల రుణం పొందారు. ఆపై బ్యాంకు అధికారుల ఆడిటింగ్ లో ఈ విషయం బయటపడగా, అప్పట్లో బ్యాంకు మేనేజర్ గా ఉన్న గరికపాటి సుబ్రహ్మణ్యం చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. కేసు కోర్టుకు వెళ్లడంతో, విచారణ జరిపిన సుల్తానా బేగం తీర్పు వెల్లడించారు.