Narendra Modi: స్వదేశంలో 'మౌని బాబా', విదేశాల్లో మాత్రం వాగుడుకాయ: మోదీపై విరుచుకుపడ్డ శివసేన
- మోదీ విఫలమయ్యారన్న భాగస్వామి శివసేన
- 'సామ్నా' పత్రికలో సంపాదకీయం
- మన్మోహన్ సూచనలు పాటిస్తే మంచిదని సలహా
ఇండియాలో నెలకొన్న సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో మాట్లాడిన మాటలపై ఎన్డీయే భాగస్వామి శివసేన విరుచుకుపడింది. ఇండియాను మోసం చేసి బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యా వంటి వారిని వెనక్కు తీసుకు వచ్చే విషయంలో మోదీ విఫలం అయ్యారని, అక్కడి నుంచి ఒట్టి చేతులతోనే ఆయన వెనక్కు తిరిగి వస్తున్నారని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు. ఇండియాలోని సమస్యలపై ఇక్కడ 'మౌని బాబా'గా ఉండే మోదీ, విదేశాల్లో మాత్రం మాట్లాడుతున్నారని, దాని వల్ల ఎవరికి ప్రయోజనమని అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన సలహాలు, సూచనలను మోదీ అనుసరిస్తే బాగుంటుందని 'సామ్నా' సంపాదకీయంలో ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు. ఇండియాలో మాట్లాడటం కన్నా విదేశాల్లో మాట్లాడటమే మంచిదని మోదీ అభిప్రాయపడుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు. లండన్ నుంచి వచ్చిన తరువాత, అక్కడ చేసిన ప్రసంగాన్నే ఇక్కడా చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
కాగా, లండన్ లో మోదీ మాట్లాడుతూ, ఇండియాలో అత్యాచార ఘటనలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇండియాలో జరుగుతున్న అవమానకర ఘటనలను విదేశాల్లో ప్రస్తావించడం ఏంటని 'సామ్నా' ప్రశ్నించింది.