chief justice: వెంకయ్యనాయడు కోర్టులో బంతి... అభిశంసన తీర్మానంతో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు పోయేదేమీ లేదు!
- రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్యనాయుడు నిర్ణయం కీలకం
- ఆరోపణలు నిజమని కమిటీ నిర్ధారిస్తేనే సభలో చర్చ
- ఆ తర్వాత రెండు సభల్లోనూ ఆమోదం లభించాలి
- మరో ఆరు నెలల్లో రిటైర్ కానున్న చీఫ్ జస్టిస్
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన నోటీసును ప్రతిపక్షాలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు అందజేయడంతో దీనిపై ఆయన తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఈ నోటీసును తిరస్కరించాలా? లేక అనుమతించాలా? అన్న విషయంలో రాజ్యసభ చైర్మన్ కు స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఈ తరహా కేసుల్లో నోటీసు అనుమతించకపోతే అది అసాధారణ నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే, ఇలా అభిశంసన నోటీసును తిరస్కరించిన సందర్భం గతంలో 1970లో ఒక్కసారి మాత్రమే జరిగింది. అప్పట్లో చీఫ్ జస్టిస్ స్పీకర్ ను కలసి ఇదంతా నిరర్థకమైన చర్య అంటూ నచ్చజెప్పారు. ఇక ఇప్పటి వరకూ ఏ న్యాయమూర్తిని కూడా అభిశంసించిన చరిత్ర లేదు.
అభిశంసన నోటీసును అనుమతిస్తే ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. అందులో సీనియర్ సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి, ప్రముఖ న్యాయనిపుణులతో కూడిన కమిటీ ఆరోపణలపై విచారణ జరుపుతుంది. ఆరోపణల్లో వాస్తవాలున్నాయని కమిటీ విశ్వసిస్తే అప్పడు ఆ అంశాన్ని సభ చర్చకు చేపడుతుంది. అప్పుడు సభ మూడింట రెండు వంతుల మెజారిటీతో దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది మరో సభామోదానికి వెళుతుంది. అక్కడ కూడా మూడింట రెండొంతుల మెజారిటీతో దీనికి ఆమోదం లభించాలి. అక్కడ కూడా ఆమోద ముద్ర పడితే రాష్ట్రపతి ముందుకు వెళుతుంది. నిజానికి ఇది చాలా సమయం పట్టే కార్యక్రమం. కనుక చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు మిగిలి ఉన్న ఆరు నెలల పదవీ కాలంలో ఇది పూర్తయ్యే అవకాశం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.