ttd board: టీటీడీ బోర్డులోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు... ఏపీలో టీడీపీ ముఖ్య నేతలకు అవకాశం... కొత్త పాలక వర్గంపై ప్రకటన

  • సభ్యులుగా రాయపాటి, బోండా, అనిత, శివాజీ తదితరులు
  • మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి ఒక్కొక్కరికి అవకాశం
  • తమిళనాడుకు లభించని చోటు
  • చైర్మన్, 14 మంది సభ్యులు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులతో బోర్డు ఏర్పాటు

పుట్టా సుధాకర్ యాదవ్ తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలి చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ సారి కొత్త పాలక వర్గంలోకి తమిళనాడు నుంచి ఎవరికీ చోటివ్వలేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి ఇద్దరికి స్థానం లభించింది. వీరిలో ఒకరు ప్రస్తుతం టీటీడీ పాలక సభ్యుడిగా ఉన్న ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కావడం గమనార్హం. మరొకరు కరీంనగర్ కు చెందిన టీడీపీ నేత ఇ.పెద్దిరెడ్డి ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఒకరికి, మహారాష్ట్ర నుంచి ఒకరికి బోర్డులో సభ్యత్వం లభించింది. చైర్మన్, 14 మంది సభ్యులు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులతో నూతన పాలకవర్గం ఏర్పాటైంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

పుట్టా సుధాకర్ యాదవ్ ఆంధప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు బంధువు కావడం గమనార్హం. టీటీడీ చైర్మన్ పదవికి తెగ పోటీ పడిన ఎంపీ రాయపాటి సాంబశివరావుకు కేవలం సభ్యత్వంతో సరిపెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు గౌతు శ్యాంసుందర్ శివాజి (పలాస, శ్రీకాకుళం), బోండా ఉమా మహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్), వంగలపూడి అనిత (పాయకరావుపేట), బీకే పార్థసారధి(పెనుకొండ) ఉన్నారు. అలాగే, చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రామచంద్రారెడ్డి, కడపకు చెందిన మేడా రామకృష్ణారెడ్డి, రుద్రరాజు పద్మరాజు, డొక్కా జగన్నాధం, పొట్లూరి రమేష్ బాబు కూడా సభ్యులుగా నియమితులయ్యారు. వంగలపూడి అనిత గతంలో మంత్రి పదవి కోసం విస్తృత ప్రయత్నాలు చేయగా టీడీడీ బోర్డులో సభ్యత్వంతో ఆమెను గుర్తించారు.
 
ఇన్ఫోసిస్ వ్యవస్థాక చైర్ పర్సన్ సుధా నారాయణమూర్తి తన సభ్యత్వాన్ని నిలబెట్టుకున్నారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి సుధీర్ ముంగంటివార్ భార్య సప్న ముంగంటివార్ కు చోటు లభించింది. రమేష్ బాబు ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్, ఎండీ. అలాగే, సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ బంధువు కూడా. టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు.

  • Loading...

More Telugu News