Air India: 15 నిమిషాలపాటు ప్రయాణికులను బెంబేలెత్తించిన ఎయిరిండియా విమానం!
- బంప్ వద్ద కేబిన్‌ను బలంగా గుద్దుకున్న ప్రయాణికుడు
- విండో క్యాబిన్ విరిగి ప్రయాణికులపై పడిన వైనం
- ముగ్గురికి తీవ్ర గాయలు.. ఢిల్లీ ఆసుపత్రికి తరలింపు
అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో ప్రయాణికులను బెంబేలెత్తించిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానంలోని విండో ప్యానెల్ విరిగి ప్రయాణికులపై పడడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. దాదాపు 15 నిమిషాల పాటు ఏం జరుగుతోందో తెలియక ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు కూడా ఈ ఘటన ఓ పజిల్‌లా మారింది.
విమానం బయలుదేరాక సీటు బెల్టు ధరించని ఓ ప్రయాణికుడు బంప్ వద్ద ముందున్న కేబిన్‌ను బలంగా గుద్దుకున్నాడు. దీంతో విండో ప్యానెల్ విరిగి అతడిపై పడింది. ఈ ఘటనలో అతడితోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బయటి విండో పగలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓవర్ హెడ్ ప్యానెల్ పగలడంతో ఆక్సిజన్ మాస్కులు కిందపడ్డాయి. వైర్లు వేలాడాయి. ఈ ఘటన ప్రయాణికుల్లో భయాన్ని పెంచిందని ఎయిరిండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
విమానం ఢిల్లీలో ల్యాండైన వెంటనే గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ఓవర్ హెడ్ ప్యానెల్‌కు తల బలంగా తాకిన ప్రయాణికుడికి కుట్లు పడినట్టు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న డీజీసీఏ ఈ విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డుకు తెలియజేసింది. ప్రమాద విషయం మీడియాకు తెలిసే వరకు ఎయిరిండియా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం.