JANDHAN YOJANA: సున్నా బ్యాలన్స్ ఖాతాల్లో రూ.80,000 వేల కోట్ల నిధులు
- జన్ ధన్ యోజన ఖాతాల్లో పెరిగిపోతున్న నిధులు
- ఏప్రిల్ 11 నాటికి 31.45 కోట్లకు చేరిన ఖాతాలు
- గత డిసెంబర్ నుంచి డిపాజిట్లలో పెరుగుదల
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద బ్యాంకుల్లో ప్రారంభమైన సున్నా బ్యాలన్స్ ఖాతాలు నిధులతో గలగలమంటున్నాయి. ఈ నెల 11 నాటికి ఈ ఖాతాల్లో ఉన్న నిధులు రూ.80,540 కోట్లు. ఈ ఖాతాల్లో డిపాజిట్లు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. పేదవారిని సైతం బ్యాంకు సేవలవైపు తీసుకొచ్చేందుకు ఖాతాల్లో ఎటువంటి బ్యాలన్స్ అవసరం లేకుండా, ఇతరత్రా చార్జీలు లేని పథకాన్ని మోదీ సర్కారు తీసుకొచ్చిన విషయం విదితమే.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ ఖాతాల్లో భారీగా డిపాజిట్లు చోటు చేసుకోవడంతో నల్లధన ప్రవాహానికి వేదికలుగా మారాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. పెద్ద నోట్ల రద్దుకు ముందు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోని ఈ ఖాతాల్లో నగదు నిల్వలు రూ.45,300 కోట్లుగా ఉంటే, రద్దు తర్వాత రూ.74,000 కోట్లకు పెరిగిపోయాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. తిరిగి ఇవి గత డిసెంబర్ నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఖాతాలు తెరిచే వారి సంఖ్య పెరిగినట్టు ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. 2017 ప్రారంభంలో జన్ ధన్ యోజన ఖాతాలు 26.5 కోట్లుగా ఉంటే, ఈ ఏడాది ఏప్రిల్ 11 నాటికి ఖాతాల సంఖ్య 31.45 కోట్లకు పెరగడం గమనార్హం.