Andhra Pradesh: ఆ మాటలు మాట్లాడి ఐదుకోట్ల మంది ప్రజలను జగన్ అవమానించారు: ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
- చంద్రబాబును గాడ్సేతో జగన్ పోలుస్తారా?
- బాబును విమర్శించే నైతిక హక్కు జగన్ కు లేదు
- జగన్ దృష్టంతా సీఎం పదవిపైనే ఉంది
- మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పులేదు
ఏపీ సీఎం చంద్రబాబును గాడ్సేతో పోల్చిన జగన్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈరోజు మీడియాతో మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ, జగన్ అలాంటి మాటలు మాట్లాడి ఐదుకోట్ల మంది ప్రజలను అవమానించారని అన్నారు. ప్రజా సమస్యలు పట్టని జగన్ ధ్యాసంతా ముఖ్యమంత్రి పీఠం మీదే ఉందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పులేదని అన్నారు. ప్రతిపక్ష నేతలను కుక్కలు, పాములతో అమిత్ షా పోల్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆనంద్ బాబు ప్రస్తావించారు. బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
కాగా, మరో మంత్రి జవహర్ మాట్లాడుతూ, చంద్రబాబును గాడ్సేతో పోల్చడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్ కు లేదని అన్నారు. వైఎస్ హెలికాప్టర్ గల్లంతైన సమయంలో జగన్ ఎక్కడున్నారు? ఆ సమయంలో కోల్ కతాలోని హోటల్ లో జగన్ ఏం చేస్తున్నారో చెప్పాలి? అని ప్రశ్నించారు. వైఎస్ మృతదేహం ఉండగానే జగన్ సంతకాలు సేకరించిన విషయాన్ని మర్చిపోలేదని, జగన్ కు సీఎం పదవిపై కాంక్ష తప్ప మరోటి లేదని విమర్శించారు.