shahid kapoor: 'నా భార్య సహకారం లేకపోతే ఈ సినిమా చేసేవాడినే కాను'.. షాహిద్ కపూర్
- పద్మావత్ సినిమాలో షాహిద్ అద్భుత నటన
- పద్మావత్ భర్త రాజా రావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్
- తన భార్యకు అవార్డు అంకితమిస్తున్నానని వ్యాఖ్య
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌కి దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్.. ‘దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు’ ప్రదానం చేసింది. పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించగా, అదే సినిమాలో పద్మావత్ (దీపిక పదుకొణె) భర్త రాజా రావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటించారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ నటనకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయిపోయారు. ఈ సినిమాలోని ఆయన నటకే ఉత్తమనటుడిగా దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కింది.
అవార్డు అందుకున్న సందర్భంగా షాహిద్ కపూర్ మాట్లాడుతూ... ఈ ఏడాది తాను అందుకున్న తొలి అవార్డు ఇదని హర్షం వ్యక్తం చేశాడు. ఆ అవార్డును తన భార్య మీరా కపూర్‌కి అంకితం చేస్తున్నానని, ‘పద్మావత్’ సినిమాలో తాను నటిస్తోన్న సమయంలో ఆమె తనకు సహకరించిందని అన్నాడు. తన భార్యకు ధన్యవాదాలు చెబుతున్నానని, తాను లేకుండా ఈ సినిమా చేసేవాడినే కానని చెప్పాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన పద్మావత్ సినిమా మొదట వివాదాల్లో చిక్కుకుని, సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలకు నోచుకుని విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షాహిద్ కపూర్ పలు సినిమాల్లో నటిస్తున్నాడు.