China: రెండు రోజుల చైనా పర్యటనకు వెళుతున్న మోదీ!
- ఈ నెల 27, 28 తేదీల్లో చైనాలో పర్యటన
- చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశం
- ఇరుదేశాల మధ్య సత్సంబంధాల బలోపేతంపై చర్చలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27, 28 తేదీల్లో చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశంలో వుహన్ నగరంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశం అవుతారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంయుక్తంగా ప్రకటించారు. భారత్, చైనాల మధ్య సత్సంబంధాల బలోపేతం, భవిష్యత్తులో దీర్ఘకాలికంగా ఇరు దేశాలు కలిసి అంతర్జాతీయంగా వ్యవహరించాల్సిన తీరుపై మోదీ, జిన్పింగ్ చర్చించనున్నారు.
అలాగే ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రిగా ఎన్నికయిన తరువాత మోదీ ఇప్పటివరకు మూడు సార్లు చైనాలో పర్యటించారు. ఈ నెల 27, 28న చైనాలో పర్యటించిన అనంతరం ఈ ఏడాది జూన్ 9, 10వ తేదీల్లో కూడా మోదీ ఆ దేశంలోని క్వింగ్డావో నగరంలో జరిగే ఎస్సీవో సమ్మిట్లో హాజరుకావాల్సి ఉంది.