Narendra Modi: మోదీ ధుర్యోధనుడు.. అమిత్‌ షా దుశ్శాసనుడు: సీతారాం ఏచూరి విమర్శలు

  • కౌరవుల్లాంటి బీజేపీ సైన్యాన్ని ఓడించాలి
  • మతోన్మాదాన్ని పెంచుతున్నారు
  • గోరక్ష పేరుతో దాడులు జరుపుతున్నారు
  • ఎలాంటి తిండి తినాలో కూడా వారే చెబుతున్నారు

మతోన్మాదాన్ని పెంచి, హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు రేపి, వాటి వల్ల హిందుత్వ ఓటు బ్యాంకుతో బీజేపీ లాభపడుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి అన్నారు. దీనివల్ల దేశ ఐక్యతకి ముప్పు తీసుకొచ్చారని, ఇప్పుడు ఉన్న దుస్థితిని మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. గోరక్ష పేరుతో దాడులు జరుపుతున్నారని, ఏ రకమైన బట్టలు వేసుకోవాలి? ఎలాంటి తిండి తినాలి? ఎటువంటి వారితో స్నేహం చేయాలి? అన్న విషయాలన్నీ వారే చెబుతున్నారని విమర్శించారు.
 
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో సీపీఎం జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ... "రామాయణం కథ చెప్పి రాముడి పేరుని ఉపయోగించుకుంటూ ఓట్లు పొందారు. కానీ, మహాభారతం కథని మర్చిపోయారు.. అందులో కౌరవులు ఉంటారు.. వారు వంద మంది అన్నదమ్ములు. పాండవులు ఐదుగురు.. ఈ వందమంది కౌరవులు తమకి బలం ఎక్కువగా ఉందనుకుని పాండవులకి ఐదు గ్రామాలు కూడా ఇవ్వబోమని చెబుతారు.

ఈ వంద మంది కౌరవుల్లో మీకు ఎంతమంది పేర్లు తెలుసు? నాకు రెండే తెలుసు.. మీకు కూడా రెండే తెలుసు. వారే దుర్యోధనుడు, దుశ్శాసనుడు. ఇప్పుడు బీజేపీ సైన్యంలో ఎంత మంది పేర్లు తెలుసు? మీకు ఒకటి నరేంద్ర మోదీ.. రెండు అమిత్‌ షా.. వారిలో ఒకరు ధుర్యోధనుడిలాంటి వారు, రెండో వారు దుశ్శాసనుడిలాంటి వారు... మహా భారతంలో కౌరవ సైన్యాన్ని ఐదుగురు పాండవులు ఓడించారు.

భీష్ముడు, ద్రోణాచార్యుడు కౌరవులతో ఉన్నారు.. అదే విధంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ తమకెవ్వరూ అడ్డులేరంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వామపక్ష ఐక్యతని బలపర్చాలి ప్రజా ఉద్యమాలు బలపర్చాలి. కౌరవ సేనల్లా వ్యవహరిస్తోన్న అధికారంలో ఉన్న బీజేపీని ఓడించాలి" అని వ్యాఖ్యానించారు. వామపక్షాల ఐక్యత, ప్రజా ఉద్యమాలతో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు.

మూడో కూటమిపై..
మూడో ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో మాట్లాడారని, అధికారం కోసమే మూడో కూటమి వస్తే ఉపయోగం ఉండదని సీతారాం ఏచూరి అన్నారు. మూడో కూటమి విధానాలను చూసి తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News