bihar: గొప్ప గొప్ప ఉద్యోగాలను వదిలి.. రాజకీయ రంగప్రవేశం చేయనున్న 50 మంది ఐఐటియన్లు
- బీహార్ లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం
- బహుజన్ ఆజాద్ పార్టీ
- ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన ఐఐటియన్లు
గొప్పగొప్ప ఉద్యోగాల్లో స్థిరపడిన 50 మంది ఐఐటియన్లు.. తాము చేస్తున్న ఉద్యోగం కంటే సమాజ శ్రేయస్సే ముఖ్యమని భావించి, వెనకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడేందుకు 'బహుజన్ ఆజాద్' పార్టీని స్థాపించారు. పార్టీ రిజిస్ట్రేషన్ కు జాతీయ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఈ 50 మందిలో మెజారిటీ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు వుండడం విశేషం. ఈ సందర్భంగా ఈ టీమ్ నాయకుడు, ఢిల్లీ ఐఐటీ పూర్వ విద్యార్థి నావెన్ కుమార్ మాట్లాడుతూ, తామంతా వివిధ ఐఐటీల నుంచి బయటకు వచ్చిన 50 మంది సభ్యులమని చెప్పారు. తామంతా చేస్తున్న ఉద్యోగాలను వదిలేశామని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ తమ పార్టీకి ఇచ్చే ధ్రువీకరణ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
పార్టీ స్థాపించగానే హడావుడిగా ఎన్నికల్లోకి దూకాలని తాము భావించడం లేదని, ముందు తమ సిద్ధాంతాలను మారుమూల ప్రాంతాల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలే తమ ప్రథమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగంలో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని వారు పేర్కొన్నారు. ఏదైనా పార్టీ, సిద్ధాంతానికి తాము వ్యతిరేకం కాదని, తమ లక్ష్యాలు, సిద్దాంతాలతో ముందుకు వెళ్లాలనుకుంటున్నామని వారు చెప్పారు. ఈ మేరకు తమ లక్ష్యాలను వివరిస్తూ, సామాజిక మాధ్యమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్, ఏపీజే అబ్దుల్ కలాం, మరికొంతమంది నాయకుల చిత్రాలతో పాటు తమ బృందంలోని కొందరు నాయకులు కలిగిన ఒక పోస్టర్ ను ఈ పార్టీ విడుదల చేసింది.