VHP: ముస్లిం డ్రైవర్‌తో నేను ప్రయాణం చేయనంతే.. వివాదంలో వీహెచ్‌పీ మీడియా సలహాదారు
- తాను బుక్ చేసుకున్న ఓలా క్యాబ్‌కు ముస్లిం డ్రైవర్ కావడంతో రైడ్ రద్దు
- తన డబ్బులు జిహాదీకి ఇవ్వబోనంటూ ట్వీట్
- దేశ వ్యాప్తంగా దుమారం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సోషల్ మీడియా సలహాదారు అభిషేక్ మిశ్రా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో చేసిన ఓ పోస్టు ఇప్పుడు దుమారం రేపుతోంది. ఓలా క్యాబ్‌లో ముస్లిం డ్రైవర్‌తో తాను ప్రయాణించలేనని చెబుతూ రైడ్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌పై దేశవ్యాప్తంగా పెను దుమారం చెలరేగింది. ఆయన ట్విట్టర్ ఖాతాను నిషేధించాలని పలువురు డిమాండ్ చేశారు. అభిషేక్ మిశ్రా ట్వీట్‌పై ఓలా కూడా ఘాటుగానే స్పందించింది. తమ సేవలకు, మతానికి సంబంధం లేదని, సేవలు లౌకికంగా ఉంటాయని తేల్చి చెప్పింది.
‘‘ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్న నేను డ్రైవర్ ముస్లిం అని తెలిసి తర్వాత రద్దు చేసుకున్నాను. నేను నా డబ్బులను జిహాదీలకు ఇవ్వాలనుకోవడం లేదు’’ అని అభిషేక్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. అభిషేక్‌కు 14వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, ఆర్కే సింగ్, మహేశ్ శర్మ, రామ్ కృపాల్ యాదవ్, నరేంద్రసింగ్ తోమర్ వంటి కేంద్రమంత్రులు కూడా ఆయన ఫాలోవర్లే.
మిశ్రా శుక్రవారం సాయంత్రం ఈ పోస్టు చేసినప్పటికీ ఆదివారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి వివాదమైంది. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ నూతన అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోక్జే అయోధ్యలో రామ మందిర పూజారులతో చర్చలు జరపడానికి ముందు ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం.