nikaragva: నికరాగ్వాలో దారుణం.. టీవీ లైవ్ లో మాట్లాడుతుండగా జర్నలిస్టు హత్య!
- ఆందోళనలకు కారణమైన అధ్యక్షుడి బిల్లు
- తీవ్ర నిరసనలతో అట్టుడుకుతున్న నికరాగ్వా
- ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తున్న జర్నలిస్టు ఏంజెల్ గహోనా
సామాజిక భద్రతా పథకాల సంస్కరణలపై నికరాగ్వా అధ్యక్షుడు డేనియెల్ ఆర్టేగా ఆ దేశ చట్టసభలో గత బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు తీవ్ర ఆందోళనలకు కారణమైంది. దీంతో అప్పటి నుంచి సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వా తీవ్ర నిరసనలతో అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ఈ నిరసనలో భాగంగా, నిరసనకారులు ధ్వంసం చేసిన ఏటీఎం సెంటర్ గురించిన ప్రసారాలను లైవ్ ద్వారా వివరిస్తున్న స్థానిక టీవీ ఛానెల్ జర్నలిస్టు ఏంజెల్ గహోనాను గుర్తుతెలియని ఆగంతుకులు కాల్చి చంపారు.
దీంతో ఈ ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 25 మంది మరణించినట్టు మానవహక్కుల సంఘాలు చెబుతున్నాయి. గహోనాపై ఎవరు కాల్పులు జరిపారో తెలియదు కానీ, ఆ పరిసరాల్లో తుపాకులు పట్టుకుని పోలీసులే సంచరిస్తున్నారని మరో జర్నలిస్టు తెలిపాడు.