Telugudesam: శ్రీరెడ్డి వెనుక రామ్ గోపాల్ వర్మ, కత్తి మహేశ్, వైసీపీ నేతలు ఉన్నారు: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ
- పవన్ ఆరోపణలకు ఏ ఆధారాలు ఉన్నాయి?
- తెలంగాణలో కూర్చొని టీడీపీపై కుట్ర పన్నారు
- మోదీని ఎందుకు విమర్శించరు?
ఒక ఆరోపణ చేస్తున్నారంటే దానికి ఆధారాలు ఉండాలని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిరసన తెలిపిన శ్రీరెడ్డి వెనుక రామ్ గోపాల్ వర్మ, కత్తి మహేశ్, వైసీపీ నేతలు ఉన్నారని అన్నారు. ఈ విషయంలో లోకేశ్‌పై ఆరోపణలు చేయడమేంటని నిలదీశారు.
"అందరూ రాష్ట్ర హక్కుల కోసం ధర్మ పోరాట దీక్ష చేస్తోంటే మరోవైపు మీరు తెలంగాణలో కూర్చొని ఆంధ్రలో చేసే దీక్షను భగ్నం చేసే విధంగా టీడీపీపై కుట్ర పన్నారు.. టీడీపీని ఇబ్బందులకు గురి చేయాలనుకున్నారు.. ఒక్కసారైనా ప్రత్యేక హోదాపై, హామీల అమలుపై మోదీని నిలదీశారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన హక్కుల కోసం పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాం, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం. మీరు మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదు?" అని బోండా ఉమ విమర్శలు గుప్పించారు.
కాగా, 'టీవీ 9తో కలసి మీ కొడుకు, అతని స్నేహితుడు నాపై చేస్తున్న దుష్ప్రచారం మీకు తెలియదంటే నమ్మమంటారా?' అంటూ సీఎం చంద్రబాబుని పవన్ కల్యాణ్ ఇటీవల తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన విషయం తెలిసిందే.