indrania mukherjee: జైల్లో నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి: ఇంద్రాణి ముఖర్జియా
- సీబీఐ కోర్టులో ఇంద్రాణి సంచలన వ్యాఖ్యలు
- నన్ను కచ్చితంగా చంపాలనుకుంటున్నారు
- ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఇంద్రాణి
తనకు ప్రాణాపాయం ఉందని, జైల్లోనే తనను చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారంటూ షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా భయాందోళనలు వ్యక్తం చేశారు. సీబీఐ కోర్టులో ఈరోజు ఆమె ఈ మేరకు సంచలన విషయాన్ని తెలిపారు. మోతాదుకు మించి మందులు తీసుకున్న కారణంగా ఆమె అస్వస్థతకు గురైన నేపథ్యంలో... ఇటీవలే ఆమె జేజే ఆసుప్రతిలో చికిత్స తీసుకున్నారు. మరోవైపు జైల్లో ఆమె అస్వస్థతకు గురికావడంపై పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. కోర్టు వెలుపల ఆమె ఏమైనా తిని ఉండవచ్చని లేదా మోతాదుకు మించి మందులు తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు చెలరేగాయి.
ఈ సందర్భంగా కోర్టులో ఆమె మాట్లాడుతూ, విచారణ కోసం ఆరోజు కోర్టుకు వచ్చిన తాను లాయర్లను కూడా కలుసుకోలేదని... విచారణ కోసం కోర్టులోనే ఉన్నానని చెప్పారు. రోజంతా ఉపవాసం ఉన్నానని, మళ్లీ జైల్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెడు పప్పు తిన్నానని తెలిపారు. ఆ తర్వాత 7.30 గంటలకు మందులు ఇచ్చారని... కాసేపటి తర్వాత స్పృహ కోల్పోయానని చెప్పారు. 2015లో తాను ఆసుపత్రిపాలైనప్పుడు కూడా ఇలాగే జరిగిందని... అప్పుడు కూడా ఇదే మెడిసిన్ తనకు ఇచ్చారని తెలిపారు. పప్పు వల్ల ఇలా జరిగిందా? లేక మెడిసిన్ వల్ల ఇలా జరిగిందా? అనే విషయం తనకు తెలియదని... కాకపోతే, ఎవరో తనను చంపాలనుకుంటున్న మాట మాత్రం నిజమని చెప్పారు.