Venkaiah Naidu: అభిశంసన నోటీసుని తిరస్కరించిన వెంకయ్యపై ఆగ్రహం.. సుప్రీంకోర్టుకు వెళతామన్న కాంగ్రెస్
- జస్టిస్ దీపక్ మిశ్రపై అభిశంసన తీర్మానం తిరస్కరణ
- ఉపరాష్ట్రపతి నిర్ణయం సరైంది కాదన్న కాంగ్రెస్
- చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని మండిపాటు
- ఇది విచారణ చేపట్టి తీసుకోవాల్సిన నిర్ణయమని వ్యాఖ్య
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రపై కాంగ్రెస్ పార్టీ అభిశంసన తీర్మానం పెట్టగా సరైన, సహేతుకమైన కారణాలు లేవని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆ నోటీసును తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ మాట్లాడుతూ... ఉపరాష్ట్రపతి నిర్ణయం సరైంది కాదని, చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
అభిశంసన నోటీసుపై విచారణ చేపట్టి ఆ తరువాత తీసుకోవాల్సిన నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ముందే తీసుకున్నారని అన్నారు. దీన్ని తాము సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని వద్దనుకునేవారికి, కాపాడుకునేవారికి మధ్య యుద్ధాన్ని ప్రేరేపించేలా వెంకయ్య నాయుడి నిర్ణయం ఉందని అన్నారు.