Bharath Ane Nenu: నేను చేసేది చేస్తూనే ఉంటాను.. వాటి గురించి నేను చెప్పుకోను: మహేశ్ బాబు
- 'భరత్ అనే నేను' చేసినందుకు చాలా గర్వంగా ఉంది
- ఇటువంటి సినిమాలను ఇంట్లో లైబ్రరీలో పెట్టుకుంటాం
- రేపు మా పిల్లలు పెద్దయ్యాక వాళ్ల పిల్లలకి చూపుతారు
- సక్సెస్ మీట్లో ప్రశ్నలకు మహేశ్ బాబు సమాధానాలు
కొరటాల శివ, మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సినిమా యూనిట్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కొరటాల శివ, మహేశ్ బాబు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ప్రశ్న: శ్రీమంతుడు సినిమా తీసిన తరువాత రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు కూడా మరిన్ని గ్రామాలను దత్తత తీసుకుంటారా?
మహేశ్ బాబు: నేనెప్పుడూ చేసేది చేస్తూనే ఉంటాను.. అందరికీ తెలుసు.. వాటి గురించి నేను చెప్పుకోను... ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది.. ఇటువంటి సినిమాలను ఇంట్లో లైబ్రరీలో పెట్టుకుంటాం.. రేపు మా పిల్లలు పెద్దయ్యాక వాళ్ల పిల్లలకి కూడా ఈ సినిమా చూపించుకుంటారు..
ప్రశ్న: ఈ సినిమా విజయంలో మీ నాన్నగారికి ఎంత షేర్ ఇస్తారు? ఈ సినిమాలో మీ వాయిస్ మొత్తం కృష్ణ వాయిస్‌లా ఉంది.
ఈ సినిమాకే కాదు నా జన్మంతా ఆయనదే.
ప్రశ్న: శ్రీమంతుడు, భరత్ అనే నేను.. మరి మూడో సినిమా ఎలా ఉండబోతుంది..
మహేశ్ బాబు: అదీ.. లీడర్ ఆఫ్ ది హౌస్.. దర్శకుడు కొరటాల శివ చెబుతారు..
కొరటాల శివ: ఇంతకంటే పెద్ద కథ రాయడానికి ఆలోచిస్తున్నాను. పూర్తికాగానే మహేశ్ బాబు ఇంటికెళ్లి అంతా రెడీ అని చెప్పేస్తాను
ప్రశ్న: ముఖ్యమంత్రి పాత్రతో సినిమా తీస్తున్నప్పుడు బ్లాక్ మనీ అంశాన్ని ఈ సినిమాలో ఎందుకు టచ్ చేయలేదు?
కొరటాల శివ: చాలా సమస్యలు ఉన్నాయి సమాజంలో.. బ్లాక్ మనీ చీఫ్ మినిస్టర్ పరిధిలో లేని సమస్య.. మన డైలీ లైఫ్‌లో మనకు ఎదురయ్యే సమస్యల వంటివి ఎక్కువగా చూపించాను.
ప్రశ్న: మహేశ్ బాబు.. మీకు సూపర్ హిట్లు కొత్త కాదు.. ఈ సినిమాకు మాత్రం చాలా ఎక్కువగా సంతోషపడుతున్నారు ఎందుకు?
మహేశ్ బాబు: నా దగ్గర డబ్బు, మంచి లైఫ్ అన్నీ ఉన్నాయి.. కానీ, రెండేళ్ల నుంచి అభిమానుల అంచనాలను రీచ్ కాలేకపోయాను.. దీంతో టెన్షన్, ఒత్తిడి పెరిగింది. ఈ సమయంలో హిట్ వచ్చింది.