Karnataka: కర్ణాటకలో మారిన సీన్.. జేడీఎస్ మద్దతిచ్చే పార్టీకే అధికారం!

  • కాంగ్రెస్-బీజేపీ హోరాహోరీ
  • హంగ్ తప్పదంటున్న సర్వేలు
  • కీలకం కానున్న జేడీఎస్, స్వతంత్రులు

కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న వారు ఇప్పుడు కాంగ్రెస్-బీజేపీ హోరాహోరీ తప్పదంటున్నారు. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత మెజారీటీ రాకపోవచ్చని చెబుతున్నారు. తాజాగా ఇండియా టుడే-కార్వీ ఒపీనియన్ పోల్స్, టీవీ9-సీవోటర్స్ సర్వేలు హంగ్ తప్పదని చెబుతున్నాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పేర్కొన్నాయి.

కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 112 స్థానాల్లో గెలుపు అవసరం. మే 12న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించినా అధికారం చేపట్టాలంటే మాత్రం జేడీఎస్, లేదంటే స్వతంత్రుల మద్దతు అవసరమని ఇండియా టుడే-కార్వీ ఒపీనియన్‌ పోల్స్‌, టీవీ9-సీవోటర్స్‌ సర్వేలు తేల్చి చెప్పాయి. అదే సమయంలో జేడీఎస్ కనుక బీజేపీకి మద్దతు ఇస్తే, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉందని తేల్చింది. అంటే ఇక్కడ జేడీఎస్, స్వతంత్రులు కీలకం కానున్నారన్నమాట. టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే మాత్రం కాంగ్రెస్‌ 126 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పేర్కొంది.

సోమవారం విడుదలైన ఏబీపీ-న్యూస్ సర్వే నివేదిక మాత్రం బీజేపీ 89-95 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. సిద్ధరామయ్యను 30 శాతం మంది, యడ్యూరప్పను 25 శాతం మంది, కుమారస్వామిని 20 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను జేడీఎస్ చీల్చే అవకాశం ఉందని, 51 శాతం మంది కన్నడిగులు కొత్త సర్కారును కోరుకుంటారని నివేదికలో పేర్కొంది. ప్రధానిగా రాహుల్ కంటే మోదీనే బెటరని ఓటర్లు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News