New Delhi: తలకు గాయమైతే కాలికి ఆపరేషన్ చేసి రాడ్డు వేసిన వైద్యుడు!
- రోగుల పేర్లు ఒకేలా ఉండడంతో పొరపాటు పడిన వైద్యుడు
- ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ను మరొకరికి చేసిన వైనం
- వైద్యుడిపై చర్యలకు డిమాండ్ చేస్తున్న బాధిత కుటుంబం
తలకు గాయమైతే కాలికి ఆపరేషన్ చేసి రాడ్డు అమర్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజేంద్ర త్యాగి ఢిల్లీలోని సుశ్రుత ట్రామా సెంటర్లో చేరాడు. తలకు, ముఖానికి గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. విజేంద్ర చేరిన రోజే వీరేంద్ర అనే వ్యక్తి కాలు విరిగి విజేంద్ర ఉన్న వార్డులోనే చేరాడు.
వీరిద్దరి పేర్లు ఇంచుమించు ఒకేలా ఉండడంతో గందరగోళానికి గురైన వైద్యుడు ఈనెల 19న వీరేంద్ర కాలికి చేయాల్సిన ఆపరేషన్ను విజేంద్రకు చేశాడు. కాలికి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు రాడ్డు కూడా అమర్చాడు. ఆపరేషన్ అనంతరం కాలికి కట్టుతో బయటకు వచ్చిన తండ్రిని చూసిన విజేంద్ర కుమారుడు అంకిత్ త్యాగి షాక్ తిన్నాడు. విషయాన్ని వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో నాలుక్కరుచుకున్నారు. ఆపరేషన్ చేసిన వైద్యుడిపై చర్యలకు డిమాండ్ చేశాడు.
ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడిన ఆసుపత్రి యాజమాన్యం.. ఇకపై సూపర్ విజన్ లేకుండా శస్త్రచికిత్సలు చేయకుండా నిషేధం విధించింది. కాగా, తలకు గాయాలతో ఆసుపత్రిలో చేరిన విజేంద్ర, ఇప్పుడు మంచం మీది నుంచి లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆసుపత్రిపై చట్టపరమైన చర్యలకు అంకిత్ సిద్ధమవుతున్నాడు.