Indian Oil: ఫుల్ ట్యాంక్ పెట్రోలు వద్దు... పేలుతుంది: బంకుల వద్ద హెచ్చరిక బోర్డులు!
- వాహనాల్లో అధిక నిల్వలు వద్దు
- నిండా పెట్రోలు పోయించుకోవద్దు
- హెచ్చరిస్తున్న పెట్రోలు బంకులు
పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ద్విచక్ర వాహనాల్లో పెట్రోలును అధికంగా నిల్వ ఉంచుకోవడం పట్ల చమురు కంపెనీలు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. వాహనాల్లో ట్యాంకు నిండుగా ఇంధనాన్ని నింపవద్దని, సగం మాత్రమే నింపాలని సూచిస్తున్నాయి. "ప్రమాద హెచ్చరిక... రాబోవు రోజులలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దయచేసి పెట్రోలును ట్యాంక్ లో సగం వరకే నింపండి. నిండుగా నింపితే ట్యాంక్ పేలుతుంది" అని ఇండియన్ ఆయిల్, తన బంకుల ముందు ప్రత్యేక హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదిలావుండగా, హైదరాబాద్ పరిధిలో ఉన్న 50 లక్షలకు పైగా వాహనాలు నిత్యమూ 40 లక్షల లీటర్ల పెట్రోలు, 30 లక్షల లీటర్ల డీజెల్ ను వినియోగిస్తున్నాయి. ఇక రోజూ ధరలు పెరుగుతూ ఉండటంతో, బంకులకు వెళ్లిన వాహనదారులు, ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎండల నేపథ్యంలో 20 శాతం ఇంధనం గాలిలో ఆవిరై కలుస్తోందని ఈ రంగం నిపుణులు అంచనా వేస్తున్నారు. వాహనాన్ని ఎండలో ఉంచడం కారణంగా, ఉష్ణతాపానికి పెట్రోలు ఆవిరైపోతోంది.