niti ayog: దేశం వెనుకబడి ఉండడానికి బిహార్, యూపీలే కారణం: అమితాబ్ కాంత్
- దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజ
- మానవాభివృద్ధిలో మన దేశం వెనకబడే ఉంది
- మహిళలకు అవకాశాలు కల్పించే విధానాలు అవసరం
నీతి ఆయోగ్ సంస్థ సీఈఓ అమితాబ్ కాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో కూడిన తూర్పు ప్రాంతం మన దేశ వెనుకబాటుతనానికి అవరోధంగా నిలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సామాజిక అంశాల్లో వెనుకబాటు తనానికి ఈ రాష్ట్రాలే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
సులభతర వ్యాపార నిర్వహణ విషయంలో ప్రగతి సాధించినా, మానవాభివృద్ధిలో మాత్రం వెనుకబడే ఉన్నామని చెప్పారు. మానవాభివృద్ధి సూచీలో 183 దేశాలకు గాను మన దేశం 131వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. దక్షిణ, పశ్చిమ భారత దేశంలోని రాష్ట్రాలు మంచి పనితీరు చూపిస్తూ అభివృద్దిలో వేగంగా ముందుకు వెళుతున్నాయని చెప్పారు. భారతదేశాన్ని మార్చడం అనే సవాల్ ను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. మహిళలకు కూడా అవకాశాలు కల్పించేలా విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు.