visakhapatnam: వణుకుతున్న వైజాగ్... దూసుకొస్తున్న ప్రచండ అలలు!
- ఆఫ్రికా తీర ప్రాంతాల్లో వీస్తున్న ప్రచండ గాలుల ప్రభావం
- తూర్పు తీరంవైపు దూసుకొస్తున్న ప్రచండ అలలు
- 3 నుంచి 4 మీటర్ల ఎత్తులో విరుచుకుపడనున్న అలలు
బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఆఫ్రికా తీర ప్రాంతాల్లో వీస్తున్న ప్రచండ గాలుల వల్ల మన దేశ తూర్పు తీరంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచండ అలలు తీర ప్రాంతాలపై విరుచుకుపడేందుకు దూసుకొస్తున్నాయి. 3 నుంచి 4 మీటర్ల ఎత్తులో ఈ రాకాసి అలలు విరుచుకుపడతాయని భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం (ఇన్కాయిస్) హెచ్చరించింది.
అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, కేరళ ప్రాంతాలపై ఈ అలలు ప్రభావం చూపుతాయని తెలిపింది. 26వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుందని చెప్పింది. అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ కు హెచ్చరికలు జారీ చేసింది.
ఇన్కాయిస్ హెచ్చరికలతో విశాఖ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో అనే భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే వాతావరణంలో మార్పులు సంభవించాయి. గాలుల తీవ్రత పెరిగింది. కాసేపటి క్రితం వర్షం కూడా కురిసింది. సముద్ర స్నానాలు నిలిపివేయాలని, సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఇన్కాయిస్ సూచించింది. కేరళలో ఇప్పటికే 100 ఇళ్లు నీట మునిగినట్టు సమాచారం.