gnanavel raja: తెలుగులో కోట్లు తీసుకునే నటులు కూడా అడ్వాన్స్ గా మాత్రం 5 లక్షలే తీసుకుంటారు!: తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా మెచ్చుకోలు
- తమిళంలోకి 'నా పేరు సూర్య'
- టైటిల్ గా 'ఎన్ పేరు సూర్య'
- అక్కడ రిలీజ్ చేస్తోన్న జ్ఞానవేల్ రాజా
వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య' రూపొందింది. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, వచ్చేనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళంలోను అదే రోజున ఈ సినిమా 'ఎన్ పేర్ సూర్య' పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా తమిళంలో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చెన్నై, 'సాలిగ్రామం'లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన .."తెలుగు చిత్రపరిశ్రమను చూసి తమిళ పరిశ్రమ నేర్చుకోవలసింది చాలా వుంది" అన్నారు.
"తెలుగులో నటీనటులు ఎంతగానో సహకరిస్తారు .. అందుకే ఆ పరిశ్రమ సుభిక్షంగా వుంది. బాలీవుడ్లోను టాలీవుడ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. తెలుగులో వంద కోట్ల వసూళ్లు రాబట్టగలిగే స్టామినా వున్న హీరోలు కూడా 15 కోట్లే తీసుకుంటారు. అది కూడా అడ్వాన్స్ గా 5 లక్షలే తీసుకుంటారు. తమిళ హీరోలు అలా కాదు, పారితోషికంగా 50 కోట్లు తీసుకుంటారు. మన తమిళ నటీనటులు ఈ విషయంలో టాలీవుడ్ హీరోలను పాటిస్తే బాగుంటుంది. ఈ విషయంపై నడిగర్ సంఘంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.