Narendra Modi: ఇలా చేస్తే మన ఆడపిల్లలను కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు!: ప్రధాని నరేంద్ర మోదీ
- సామాజిక బాధ్యత గురించి తమ కుమారులకు తల్లిదండ్రులు తెలియజెప్పాలి
- తీవ్రమైన నేరాలకు పాల్పడే వారు ఉరిశిక్ష ఎదుర్కోక తప్పదు
- అత్యాచారాలను నిరసనగా ఓ సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి
సామాజిక బాధ్యత గురించి తమ కుమారులకు వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తెలియజెప్పాలని, ఇలా చేస్తే మన ఆడపిల్లలను కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం, మోదీ మాట్లాడుతూ, ప్రజల హృదయ స్పందనలు ఢిల్లీ సర్కార్ వింటోందని అన్నారు. కుటుంబాల్లో ఆడపిల్లలకు ఉన్నత గౌరవం కల్పించాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని, వారిని మనందరమూ గౌరవించడమే కాకుండా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
ఈ సందర్భంగా పన్నెండేళ్ల లోపు, పదహారేళ్ల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే వరుసగా ఉరిశిక్ష, జీవితఖైదు విధించేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గురించి మోదీ ప్రస్తావించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారు ఉరిశిక్ష ఎదుర్కోక తప్పదని హెచ్చరించిన మోదీ, ఈ సమస్య నుంచి దేశానికి విముక్తి కలగాలని కోరుకున్నారు. అందుకోసం, అందరూ ఏకతాటిపైకి రావాలని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ ఓ సామాజిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని మోదీ సూచించారు.